చర్చల ప్రక్రియ తిరిగి మొదలవ్వాలంటే... పాకిస్తాన్ ఉగ్ర పంథాను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో సత్ససంబంధాలనే భారత్ కొరుకుంటోందని, దక్షిణాసియాలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ‘రైసినా చర్చల’ ప్రారంభోత్సవంలో మోదీ మంగళవారం ప్రసంగించారు. ఈ శతాబ్దం ఆసియాదేనని ఆయన పేర్కొన్నారు. భారత్ విదేశాంగ ప్రాధమ్యాలు, హిందూ మహాసముద్రంలో భద్రతా ప్రయోజనాలు, పొరుగు దేశాలతో పాటు గల్ఫ్, అమెరికా, చైనా, రష్యాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మాట్లాడారు. ‘భారత్ ఒక్కటే ఒంటరిగా శాంతి మార్గంలో పయనించలేదు. పాకిస్తాన్ సైతం కలిసి నడవాలి. భారత్‌తో చర్చల దిశగా పాకిస్తాన్ సాగాలనుకుంటే ఉగ్రబాటను విడిచిపెట్టాలి’ అని పేర్కొన్నారు.