సచివాలయ ఉద్యోగులతో వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సోమవారం కళకళలాడింది. ఉదయం నుంచి ఉద్యోగులు డిపార్టుమెంట్స్ వారీగా సచివాలయానికి వచ్చారు. మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో 30 శాఖలు ఈరోజు నూతన సచివాలయంలో అడుగుపెట్టాయి. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖలు రాలేదు. ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు తమ చాంబర్‌లలో కాలుమోపారు. కొందరు సీట్లలో కూర్చోగా మరికొందరు కార్యాలయాలు పరిశీలించి సరిపెట్టారు. కొన్ని చోట్ల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ల బిగింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఘన స్వాగతం పలికారు.