భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. వెయ్యినోట్లు పనిచేయబోవని మోదీ స్పష్టం చేశారు. దేశంలో భారీగా పోగుపడ్డ నల్లధనాన్ని నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఆలోపు బ్యాంకులు, లేదా పోస్టాఫీస్‌లకు వెళ్లి రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించారు.