అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీనే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని తోసిరాజని నరేంద్రమోడీకే మెజారిటీ ఓటర్లు పట్టం కట్టారు. సీఎస్‌డీఎస్ ఆధ్వర్యంలో సీఎన్‌ఎన్- ఐబీఎన్, ది వీక్‌లు నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలో 35 శాతం ఓటర్లు నరేంద్ర మోడీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలపగా, 17 శాతం ఓటర్లు రాహుల్ ప్రధాని కావాలని కోరుకున్నారు. చెరో 5 శాతం ఓట్లతో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమానంగా నిలిచారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ప్రధాని కావాలని కేవలం ఒక్క శాతం ఓటర్లే కోరుకుంటుండటం విశేషం. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకుండా ప్రధానిగా మీరెవరిని కోరుకుంటారన్న ప్రశ్నకు ఓటర్లు పై విధంగా స్పందించారు. మోడీ, రాహుల్.. ఈ ఇద్దరిలో ప్రధాని పదవికి ఎవరిని ఎన్నుకుంటారన్న ప్రశ్నకు 45 శాతం మోడీకి ఓటేయగా, 29 శాతం రాహుల్ కావాలన్నారు. మొత్తంమీద 39 శాతం ఓటర్లు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించాలన్నారు. మోడీ సమర్ధవంతమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడని 26 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు పీఎం కావాలన్న ప్రశ్నకు 48 శాతం మోడీ, 7 శాతం అద్వానీ, 4 శాతం సుష్మా స్వరాజ్‌లను కోరుకున్నారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరుండాలన్న ప్రశ్నకు.. 35 శాతం రాహుల్‌గాంధీకి, 10 శాతం సోనియాగాంధీకి, 8 శాతం మన్మోహన్‌సింగ్‌కు ఓటేశారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి అధికారంలోకొస్తే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని కావాలని అత్యధికంగా12 శాతం మంది కోరుకున్నారు. ఎన్‌డీఏకు దాదాపు 200 సీట్లు అలాగే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 57 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 12 మాత్రమే గెల్చుకోనుందని వెల్లడించింది. 2009 ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది. మొత్తంమీద దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 187- 195 స్థానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 134- 142 సీట్లు రావచ్చని సర్వే పేర్కొంది. సర్వేలో ఢిల్లీలో 2507, మధ్యప్రదేశ్‌లో 2870, ఛత్తీస్‌గఢ్‌లో 1861, రాజస్థాన్‌లో 4427 మందిని శాంపిల్ సైజ్‌గా తీసుకున్నారు. ఈ ఏడాది జూలైలో కూడా సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే నిర్వహించింది. అప్పటికీ, ఇప్పటికీ ఆ నాలుగు రాష్ట్రాల్లో మోడీకి మద్దతు గణనీయంగా పెరగడం విశేషం. అలాగే, యూపీఏ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి అప్పటికన్నా పెరగడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే విషయం.
Published Fri, Nov 1 2013 6:47 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement