హైదరాబాద్ నగర శివార్లలోని నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ గ్రీన్ ఐకానిక్ అపార్ట్‌మెంట్‌లో భార్య పావనిరెడ్డితో ప్రదీప్ నివసిస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన.. తన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడే విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ పట్టా పొందారు. ప్రదీప్‌కు చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనూ కొన్ని డ్రామాల్లో నటించారు. 2006లో విడుదలైన చుక్కల్లో చంద్రుడు సినిమాలో చిన్న పాత్ర పోషించారు. అదే సినిమాలో నటించిన పావని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారినప్పటికీ జీవితాల్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి ఇరువురూ సహజీవనం చేశారు. 2016 ఆగస్టు 21న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రదీప్ ప్రస్తుతం తమిళ సీరియల్‌లోనూ నటిస్తున్నారు. అగ్నిపూలు, కుటుంబ గౌరవం సీరియళ్లలో హీరోయిన్‌గా నటించిన పావని ప్రస్తుతం.. నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్‌లో ప్రదీప్‌తో కలసి హీరోయిన్‌గా నటిస్తున్నారు.