వైఎస్ విజయమ్మకు హైకోర్టులో ఊరట | relief-to-ys-vijayamma-in-high-court | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 11 2014 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు భ్రదత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్కు కూడా భద్రత కొనసాగించాలని కోర్టు దేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది. వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంపై విజయమ్మ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్లో విజయమ్మ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా తమ భద్రత ఉపసంహరణపై వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడింటిని విచారించిన కోర్టు వారికి భద్రత కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement