రాష్ట్ర విభజనతో సీమాంధ్ర వల్లకాడు అవుతుందని షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాగడానికే కాదు, సాగుకు కూడా సీమాంధ్రకు నీళ్లు దొరకవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా చిత్తూరు చేరుకున్న షర్మిల... పీసీఆర్ కాలేజీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో మద్రాసు నుంచి వెల్లగొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఒక పక్క నీళ్లూ ఇవ్వక హైదరాబాద్‌లో స్థానం ఇవ్వకుంటే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. రాయలసీమలో ఉన్న వారు వ్యవసాయం చేసుకోవాలా, వద్దా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల కోసం ఎక్కడికి వెళ్లాలి, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబులో ఏ చలనం లేదని దుయ్యబట్టారు. విభజనకు కారణం చంద్రబాబే అన్నారు. బ్లాంక్ చెక్కు ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలంగా ఆయన లేఖ ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు లేఖ ఇవ్వకుంటే కేంద్రం విభజించే సాహసం చేసివుండేది కాదన్నారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ ముఖం పెట్టుకుని యాత్ర చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గురించి తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి నిరసన తెలిపారని అన్నారు. ఎంత మంది సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాజీనామా చేశారని నిలదీశారు. గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. అంతమంది ఎంపీలు ఉండి ఢిల్లీ దర్బార్లో వంగి.. వంగి సలాములు కొడుతూ తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్నను ధైర్యంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని షర్మిల ఆరోపించారు. కుట్రలతో అక్రమ కేసులు పెట్టి సీబీఐని ఉసిగొల్పారని అన్నారు. న్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు కేంద్రానికి లేదని షర్మిల అన్నారు.
Published Tue, Sep 3 2013 2:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement