మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణకు తుది గడువు కూడా మంగళవారమే ముగియడంతో మొత్తం మిగిలిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. మొత్తం 146 మున్సిపాలిటీలలోని 3990 వార్డుల కోసం 17,795 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 1456 మంది పోటీలో ఉన్నారన్నారు. జడ్పీటీసీలకు 273 నామినేషన్లు దాఖలు అయ్యాయని, ఎంపీటీసీలకు 3335 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇక వీటికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు తుదిగడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో మద్యం ,డబ్బు పంపిణీని అరికట్టడానికి వీడియో సర్వేలు చేస్తున్నామని, ఇందుకోసం రెవిన్యూ,ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లు పనిచేస్తున్నాయని నవీన్ మిట్టల్ చెప్పారు. తాము మొత్తం రూ. 37.54 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, అలాగే 1.07 లక్షల లీటర్ల నాటు సారాను సీజ్ చేశామని అన్నారు. 4462 మందిపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, 212 వాహనాలను సీజ్ చేశామన్నారు. 1.77 లక్షల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, గోడలపై పోస్టర్లను అంటించినవారిపై 63,810 కేసులు నమోదు చేశామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, చీరలు, బంగారాన్ని కూడా సీజ్ చేశామని ఆయన వివరించారు. మొత్తం 22 జిల్లాలలో 44 మంది అధికారుల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు.
Published Wed, Mar 19 2014 5:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement