తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను ఈ నెల ఏడు నుంచి 18 వరకూ విడుదల చేయాలని జస్టిస్ ఉదయ్‌లలిత్, జస్టిస్ దీపక్‌మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకను మంగళవారం ఆదేశించింది. కావేరి నదీ జలాల వివాదానికి సంబంధించి గత నెల ఐదు నుంచి ద్విసభ ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ధర్మాసనం మంగళవారం తమిళనాడు, కర్ణాటకతో పాటు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగి వాదనలు విన్నది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడంతో పాటు కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝ నేతృత్వంలో నిపుణుల కమిటీ కావేరి నదీ పరివాహక రాష్ట్రాల్లో పర్యటించి ఈ నెల 17న నివేదిక అందజేయాలని ఆదేశించింది.