అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్రెడ్డిని తహశీల్దార్ ఆఫీసుకు పిలిపించి హత్య చేశారని ఆయన సోదరుడు ఆనంద్ రెడ్డి ఆరోపించారు. ఇందులో మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆనంద్ రెడ్డి అన్నారు. ప్రసాద్ రెడ్డికి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఆనంద్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న హత్యలకు భయపడేదిలేదని చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యతో రాప్తాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతపురం జిల్లా రాప్తాడు తాహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆరుగురు దుండగులు ఎమ్మార్వో కార్యాలయంలోకి ప్రవేశించి... అక్కడే ఉన్న ప్రసాద్రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు.