తెలంగాణలో సైకిల్కు పోయిన గాలి! | tdp weak in telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 15 2014 8:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

తెలంగాణలో సైకిల్కు గాలిపోయింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పాల్గొన్న సభలే అందుకు నిదర్శనం. తెలంగాణలో సైకిల్‌కు సీన్ సితారవుతోంది. ఏదెదో చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించిన సైకిల్ సారధికి చుక్కలు కనిపిస్తున్నాయి. బాబు మాటలు పూర్తిగా వినకుండానే జనం వెళ్లిపోయారు. సామాజిక తెలంగాణ తమతోనే సాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఇరగదీస్తాం అన్నారు. కాషాయం-పచ్చ జెండాలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ఆయన ఎంత చెప్పినా పప్పులు ఉడకడం లేదు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమో పచ్చసారును పట్టించుకోవడం మానేశారు. తానేదో ఉద్దరిస్తానంటూ ఊదరగొడుతుంటే అంతలేదబ్బా అంటూ ప్రజలు అటు వైపే చూడడం లేదు. ఏదో కొద్దిపాటి భజనం తప్పితే ఆయన సభల్లో ప్రజాస్పందనే కరవవుతోంది. భాగ్యనగరం సాక్షిగా చంద్రబాబు డాబు పటాపంచలైంది. ఎన్నికలకు సంబంధించి పార్టీ కేడర్‌లో జోష్ పుట్టించడానికి చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఆయన చేపట్టిన రోడ్ షో అట్టర్ఫ్లాఫ్. భారీ కాన్వాయ్‌తో నగర పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి మొదలుపెట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బాలరాయి, కంటోన్మెంట్‌ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి, బోడుప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్‌ మీదుగా పర్యటించారు. అంతటా నిరాశే మిగిలింది. అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటి అన్నట్లుగా తయారైంది బాబు పరిస్థితి. భాగ్యనగర పర్యటనలో జనం సాదర స్వాగతం పలికి పొగడపూల మాలలు కప్పి తన మాటలకు జేజేలు పలుకుతారని ఊహిస్తే అంతా తల్లకిందులైంది. రోడ్‌షోలో బాబు కాన్వాయ్‌ తప్పితే జనం కనిపించలేదు. పోనీ సభలకైనా జనం వచ్చారా అంటే అక్కడా చుక్కెదురైంది. ప్రజలు కూర్చోవడానికి వేసిన కుర్చీల్లో చాలా వరకు ఖాళీగా కనిపించాయి. వచ్చిన జనంలోనూ చాలా మంది సభ పూర్తయేంతవరకు కూడా ఉండలేక తిరుగుముఖం పట్టారు. బాబు తిరిగిన నియోజకవర్గాలు కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడ్చల్‌, ఎల్బీనగర్‌సలో సభలన్నీ వెలవెలపోగా నేతలు సైతం బాబుకు హ్యాండిచ్చారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్‌ కృష్ణయ్యకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు సామ రంగారెడ్డి, కృష్ణప్రసాద్ సహా ఐదుగురు కార్పొరేటర్లు బాబు సభకు డుమ్మా కొట్టారు. దీనిపై స్వయంగా చంద్రబాబే సమాధానం చెప్పుకున్నారు. అటు జనమూ లేక ఇటు నాయకులూ రాక చంద్రబాబు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చిందని భాగ్యనగరవాసులు అనకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement