చీకట్లోనే మగ్గిపోతున్న సీమాంధ్ర | Telangana crisis: Seemandhra goes powerless as shutdown | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 8 2013 7:51 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

తెలంగాణలో కూడా తీవ్రతరం కానున్న కరెంటు కోతలు ఉద్యోగులతో చర్చలు విఫలం.. విషమించనున్న సమస్య! రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లో విద్యుత్ నిలిపివేయడం ద్వారా తమ సమ్మె ప్రభావాన్ని కేంద్రానికే నేరుగా తెలియజేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. కేంద్ర విద్యుత్ సరఫరా సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సరఫరా లైన్లపై కూడా దృష్టి పెట్టారు. రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసిన పీజీసీఐఎల్‌కు చెందిన సబ్‌స్టేషన్లు, లైన్లను కూడా ట్రిప్ చేయడం ద్వారా కేంద్రానికి మరింత షాకిచ్చేందుకు ప్రయత్నించారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ ఉద్యోగులు కూడా సోమవారం ఉదయం నుంచి సమ్మె బాట పట్టడంతో విద్యుత్ ఉద్యమం మరింతగా విస్తరించింది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతా అంధకారమయంగా మారింది. ఏకంగా ఈపీడీసీఎల్ సీఎండీ ఇంటికి కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆదివారం నాటికే 3,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోగా సోమవారం జెన్‌కోకు చెందిన ప్లాంట్లలో మరో 360 మెగావాట్ల ఉత్పత్తికి గండిపడింది. సమ్మె ప్రభావం ప్రైవేట్ ప్లాంట్లకూ పాకింది. లాంకో, రిలయన్స్, స్పెక్ట్రంలకు చెందిన గ్యాస్ ఆధారిత ప్లాంట్లలోనూ విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో మరో 350 మెగావాట్లకు గండి ఏర్పడింది. ఇలా సోమవారం మొత్తం 4,490 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా కరెంటు లేమితో రాష్ట్రం అల్లాడిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రైళ్ల రాకపోకలకు సోమవారం కూడా ఆటంకం ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో కూడా పలు ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వరంగల్ జిల్లాలోని 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంటులో సాంకేతిక సమస్యతో సోమవారం రాత్రి నుంచి విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది! మధ్యాహ్నమే బాయిలర్ ట్యూబ్ లీకవడంతో 100 మెగావాట్లకు గండిపడగా, రాత్రికల్లా ప్లాంటు మొత్తానికే మూగబోయింది. కనీసం మరో రెండు రోజుల దాకా కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. దాంతో తెలంగణలో కూడా కోతలు తీవ్రతరం కావడం అనివార్యంగా కన్పిస్తోంది. మరోవైపు 140 మెగావాట్ల జూరాల ప్లాంటులోని 4 యూనిట్లలో కాలిపోయిన ప్యానల్ బోర్డులకు మరమ్మతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మెను విరమింపజేసేందుకు సమైక్యాంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (సేవ్) జేఏసీ నేతలు సాయిబాబా, శ్రీనివాసరావులతో జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ (ఇన్‌చార్జి) మునీంద్ర జరిపిన చర్యలు విఫలమయ్యాయి. కనీసం అత్యవసర సేవలకైనా మినహాయింపు ఇవ్వాలని కోరినా నేతలు ససేమిరా అన్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. అవే ట్రిప్పులు! ఆదివారం మాదిరిగానే సోమవారం కూడా సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయమే సబ్‌స్టేషన్లన్‌ను ఉద్యోగులు ట్రిప్ చేసి కరెంటు సరఫరాను నిలిపివేశారు. రాత్రి 8 గంటల నుంచి సరఫరాను పునరుద్ధరించారు. కానీ విశాఖ కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్‌లో మాత్రం సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా పునరుద్దరణ ప్రయత్నాలు మొదలవలేదు. ప్రధానంగా గరివిడి సబ్‌స్టేషన్‌ను ట్రిప్ చేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాలన్నింట్లోనూ చీకట్టు అలుముకున్నాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌కు 1,700 మెగావాట్ల విద్యుత్ తీసుకోవాల్సి ఉండగా 300 మెగావాట్లే తీసుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ కూడా 1,300 మెగావాట్లకు గాను 250 మెగావాట్లే తీసుకుంటోంది. దాంతో సోమవారం ఉదయం సీమాంధ్ర జిల్లాల్లో ఒక్కటి కూడా కరెంటుకు నోచుకోలేదు! కేంద్రానికి షాకిచ్చే ప్రయత్నాల్లో భాగంగా విశాఖ సమీపంలో ఎన్టీపీసీకి చెందిన సింహాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తిని నిలిపేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. సింహాద్రిలో 500 మెగావాట్ల సామర్థ్యమున్న 4 యూనిట్లున్నాయి. తొలి రెండు యూనిట్ల ద్వారా వచ్చే మొత్తం 1,000 మెగావాట్ల విద్యుతూ రాష్ట్రానికే సరఫరా అవుతుంది. మిగతా 1,000 మెగావాట్లు రాష్ట్రంతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది. సింహాద్రి కరెంటంతా కల్పకం వద్ద ఉన్న 400 కేవీ సబ్‌స్టేషన్ ద్వారానే సరఫరా అవుతుంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తిని నిలిపేసి తమిళనాడు, కర్ణాటక, కేరళలకు సరఫరాను నిలిపేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. కానీ సబ్‌స్టేషన్‌ను ట్రిప్ చేసే ప్రయత్నాలు తుది దశలో విఫలమవడంతో విద్యుదుత్పత్తికి ఆటంకం కలగలేదు. రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించిన పీజీసీఐఎల్‌ను కూడా ట్రిప్ చేయజూశారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని 400 కేవీ స్టేషన్‌తో పాటు గాజువాక, కృష్ణా జిల్లా సబ్‌స్టేషన్‌లల్లో విద్యుత్ సరఫరాను నిలిపేయజూశారు. పోలీసుల రంగప్రవేశంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా కేంద్రానికి కరెంటు షాకిచ్చేందుకు మరిన్ని చర్యలకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సీలేరులోనూ నిలిచిన ఉత్పత్తి సమ్మెతో విజయవాడలోని నార్లతాతరావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లో 1,960 మెగావాట్లు, వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లో 1,050 మెగావాట్లు, శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 770 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆదివారమే నిలిచిపోవడం తెలిసిందే. సోమవారం ఎగువ సీలేరులో 240 మెగావాట్లు, నాగార్జునసాగర్ కుడిగట్టు పవర్ హౌస్‌లో 90 మెగావాట్లు, డొంకరాయిలో 30 మెగావాట్ల ఉత్పత్తికీ గండిపడింది. జూరాల నుంచి కొందరు సిబ్బందిని తీసుకుని శ్రీశైలం ప్లాంటులో విద్యుదుత్పత్తికి అధికారులు చేసిన ప్రయత్నాలను ఉద్యోగులు తిప్పికొట్టారు. సరఫరా లైన్లను ఉద్యోగులు పదేపదే ట్రిప్ చేయడంతో లాంకో, స్పెక్ట్రమ్, రిలయన్స్ వంటి ప్రైవేట్ ప్లాంట్లు ఆందోళన చెందాయి. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ ఎప్పుడు సరఫరా అవుతుందో, ఎప్పుడు నిలిచిపోతుందో అర్థంగాక, ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి తీవ్ర నష్టం వాటిల్లుందనే ఆందోళనతో ఉత్పత్తిని నిలిపేశాయి. దాంతో రాష్ట్రంలోని పలు చిన్న విద్యుత్ ప్లాంట్ల ద్వారా 350 మెగావాట్లను ప్రభుత్వం కొనుగోలు చేశారు. పవర్ ఎక్చేంజ్ ద్వారా సోమవారం 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో కొనుగోలు చేసింది. సమాచార స్తంభన! రాష్ట్రంలోని నలుమూలల్లో స్థానికంగా ఉండే సబ్‌స్టేషన్లు, ప్లాంట్ల నుంచి విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ)కు ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందుతుంటుంది. ఇందుకు ఉపయోగపడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ)ను ఉద్యమకారులు లక్ష్యంగా చేసుకున్నారు. విశాఖ స్విచ్చింగ్ స్టేషన్‌కు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో రెండు ప్రాంతాల్లో ఓఎఫ్‌సీని కట్ చేశారు. దాంతో విద్యుత్ సరఫరా ఎక్కడ, ఎంత నిలిచిపోయిందనే వివరాలు వెంటనే అందుబాటులోకి రావు. అలా విద్యుత్ డిమాండ్, సరఫరాలను అంచనా వేయడంలో ఎస్‌ఎల్‌డీసీ విఫలమయ్యే ప్రమాదముంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)లో సమస్యలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలోనే గాక దక్షిణాది అంతటా గ్రిడ్‌ను కుప్పకూల్చేందుకే ఇలా చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. గ్రిడ్‌ను కుప్పకూల్చే కుట్ర: టీ జాక్ రాష్ట్రంతో పాటు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోని గ్రిడ్‌ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో-ఆర్డినేటర్ కె.రఘు ఆరోపించారు. ప్రభుత్వంతో పాటు యాజమాన్యం కూడా ఇందుకు వంతపాడుతోందని విమర్శించారు. దీనికి నిరసనగా విద్యుత్‌సౌధ ముందు సోమవారం ఉదయం నుంచి ఆయన 48 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు. ‘‘తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో ఒంటికాలిపై లేచిన ప్రభుత్వం ఇప్పుడు మిన్నకుంది. రాష్ర్టంలో జరుగుతున్న విద్యుత్ కుట్రలపై దిగ్విజయ్‌సింగ్‌కు నివేదిక పంపాం. అవసరం లేకపోయినప్పటికీ తెలంగాణలోనూ విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు’’ అని రఘు ఆరోపించారు. కార్యక్రమంలో టీజేఏఎస్ నేతలు సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement