జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. శ్రీనగర్ శివారు ప్రాంతమైన జకురలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) జవాను ఒకరు మృతిచెందాడు. ఒక పోలీసు సహా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్‌లో విధులు నిర్వర్తించిన తర్వాత జవాన్లు తమ శిబిరాలకు తిరిగి వెళ్తుండగా వారి కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ‘మా మూడు కంపెనీల సిబ్బంది ఆరు వాహనాల్లో శిబిరాలకు వెళ్తున్నాం.ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు చిన్న వీధిలోంచి వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు’ అని ఎస్‌ఎస్‌బీ అధికారి దీపక్ కుమార్ చెప్పారు. భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.