తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం అయినాలవారిపాలెం గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి వేరొకరికి అమ్మేశాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ ఇంటి సామగ్రిని తరలించేందుకు కూలీలను పురమాయించాడు. ఈ క్రమంలో కూలీలు గోడను కూలగొడుతున్నారు. అయితే, అకస్మాత్తుగా గోడకూలి ఇద్దరు కూలీలపై పడింది. తోటివారు వారిని శిథిలాల నుంచి తొలగించేసరికే చనిపోయి ఉన్నారు. మృతులను నరేంద్రపురం శివారు బూరుగుకుంట గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు(40), ముంగండ గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకన్న(35)గా గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.