ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా | | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 3 2013 9:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తే దాని ప్రభావం తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున, పంచాయతీ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ఫలితాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పాటించట్లేదని, పూర్తిస్థాయి విచారణ చేయకుండా, ప్రజల అభ్యంతరాలను స్వీకరించకుండా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తోందంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి విచారించారు. పిటిషనర్లలో కొందరి తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... బీసీ జనాభా లెక్కలు సేకరించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తరువాతనే ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని నివేదించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అశాస్త్రీయ అధ్యయనం వల్ల బీసీలకు రావాల్సిన మేర సీట్లు దక్కట్లేదంటూ గణాంకాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేసిందా... లేదా? అని ప్రభుత్వ న్యాయవాది (పంచాయతీరాజ్)ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోందని, పూర్తి వివరాలతో బుధవారం కౌంటర్లు దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. అయితే అసలు రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించిన విధానం ఏమిటో చెప్పండని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును 1995లో జరిగిన ఎన్నికల్లో అమలు చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా... అప్పటి సంగతి వద్దని, ప్రస్తుత ఎన్నికల గురించి మాత్రమే చెప్పాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ ఒక్క కారణంతో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయవచ్చునని, అశాస్త్రీయ విధానాన్ని అమలు చేస్తే ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లపై కూడా ప్రభావితం చూపుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సి.వి.మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, రిజర్వేషన్ల ఖరారులో శాస్త్రీయత లోపించిందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించాలని విన్నవించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ... ఎన్నికలను నిలుపుదల చేస్తే దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని, అందువల్ల ఎన్నికలు యథాతథంగా నిర్వహించొచ్చని, అయితే ఫలితాలు మాత్రం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement