పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం | | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 4 2013 8:56 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

చాలా కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మొత్తం మీద జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ వీటిపై ఆయాపార్టీల ప్రభావం తీవ్రంగా వుంటుంది. స్థానిక ఎన్నికల ద్వారా ఆయా పార్టీలు బలోపేతం కావడం తప్పనిసరిగా జరిగే కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతవల్ల రెండున్నరేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంవల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.. పంచాయతీలకు ముఖ్య ఆధారంగా వున్న 13వ ఆర్థిక సంఘం నిధులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకం నుంచి రావలసిన నిధులు రాలేదు. మన రాష్ట్రంలోని పంచాతీయ సంస్థలకు వివిధ రూపాల్లో రావాల్సిన రెండున్నరవేలకోట్ల రూపాయల నిలిచిపోవడంవల్ల వేలాది గ్రామాలు కనీస సౌకర్యాలు కోల్పోయాయి. వీధి దీపాల దగ్గర్నుంచి మంచినీళ్ల వరకూ అన్నీ సమస్యలే. పారిశుద్ధ్యం సరిగా లేక, మురుగునీటి పారుదల పథకాలు మూలనపడటంవల్లా అనారోగ్య పరిస్థితులు పంచాయతీల్లో రాజ్యమేలుతున్నాయి. పంచాయతీరాజ్‌ సంస్థలు ఎంతోకాలంగా మనుగడలో వున్నప్పటికీ అవి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే పరిస్థితులుండేవి కావు. జాతీయ, రాష్ట్రస్థాయిలలో మాదిరిగా అట్టడుగు స్థాయిలో అంటే పంచాయితీరాజ్‌సంస్థలలో ప్రజాస్వామ్య పతాకాన్ని రెపరెపలాడించాలనే లక్ష్యంతో నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించింది. 1993 ఏప్రిల్‌ 24నుంచి ఈ సవరణలు అమలులోక వచ్చాయి. ఈ సవరణవల్ల పంచాయతీలు, మునిసిపాలిటీలు రాజ్యంగబద్ద సంస్థలుగా అవతరించాయి. స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా సకాలంలో ఎన్నికలను నిర్వహించడం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, వెనకబడిన కులాలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించడం..అధికారాలు, నిధులు, విధుల బదలాయింపు అనేవి ఈ సవరణల ప్రధాన లక్ష్యాలు. రాష్ట్రాల పునర్విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యంగల సంస్థాపరమైన సంస్కరణగా ఈ 73, 74 సవరణల్ని రెండో పరిపాలన సంస్కరణల కమిషన్‌ పేర్కొనడమే పంచాయతీ రాజ్‌ సంస్థల విలువకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసే పంచాయతీలలో పాగా వేయడానికి ఆయాపార్టీలు తమతమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement