వరుసగా రెండోరోజూ రహదారులపై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాల్లోని రోడ్లన్నీ హోరెత్తాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడివాహనాలు అక్కడే ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా పూర్తిగా పడకేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48గంటల రహదారుల దిగ్బంధం వరుసగా రెండోరోజూ గురువారం విజయవంతమైంది. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్రమంత్రుల బృందం గురువారం సమావేశమైన నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు పార్టీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు పూర్తిగా సంఘీభావం ప్రకటిం చారు. పార్టీ శ్రేణులతో కలిసి నిరసనలు చేపట్టారు. రోడ్లపైనే మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వంటావార్పులు నిర్వహించారు. సమైక్యస్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీలుగా రోడ్లపైకి చేరుకుని వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. రెండోరోజూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గురువారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 2732 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. ఎయిర్‌పోర్టు ముట్టడి విశాఖలోని ఎయిర్‌పోర్టును ముట్టడించారు. అరకులో బుధవారంనాటి ముట్టడిలో అదుపులోకి తీసుకున్న నేతల్ని రాత్రి వరకూ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ నేతలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లామీదుగా వెళ్లే 16,216 జాతీయరహదారులతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులను పార్టీశ్రేణులు ఎక్కడికక్కడ దిగ్బంధించాయి. దిండి-చించినాడ వంతెనపై మాజీమంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-216ని దిగ్బంధించడంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోక లు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ట్రాక్టర్లను అడ్డుగాపెట్టి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. నరసాపురంలో రోడ్డుపైనే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెల్లవారుజాము నుంచి రోడ్డెక్కిన పార్టీ కార్యకర్తలు రహదారులు దిగ్బంధించారు. కొమరాడ వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 10కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి కోల్‌కత్తా వైపు వెళ్లే లారీలు జిల్లా సరిహద్దులోనే నిలిచిపోయాయి. వంటావార్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు కృష్ణాజిల్లా గట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్‌పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి వంటావార్పు నిర్వహించారు. జాతీయరహదారిపై కబడ్డీ ఆడారు. కైకలూరులో జాతీయ రహదారి నెంబరు 165పై పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్ మాస్క్‌లు ధరించి రోడ్ల దిగ్భంధనంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా రోడ్లపైనే టెంట్లు వేసి వంటావార్పు చేశారు. తాడేపల్లి జాతీయ రహదారిపై కోలాటం ఆడుతూ కార్యకర్తలు రహదారులను దిగ్బం ధించారు.ఒంగోలులోని మంగమూరు జంక్షన్‌లో వంటావార్పు చేపట్టారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. అరెస్టులకూ వెరవక... పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో తపోవనం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. రాయదుర్గం నియోజకవర్గం డీ హీరేహాళ్ వద్ద రహదారి దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గంలో ఆందోళన చేస్తున్న సమన్వయకర్తలు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామితో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. నగరిలో పార్టీ సమన్వయకర్త ఆర్‌కే.రోజా అధ్వర్యం లో పుత్తూరు-నారాయణవనం రోడ్డును దిగ్బంధించారు. పుంగనూరులో పార్టీ నాయకులు బెంగళూరు, ఎంబీటీ, తిరుపతి, చింతామణి రోడ్లను దిగ్బంధించారు. వైఎస్సార్ జిల్లా కడపలో జమ్మలమడుగులో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆర్టీసీ బస్సులు డిపోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల, రాజంపేటలో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధనం కొనసాగింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7, 18 జాతీయ రహదారులతో పాటు గ్రామాలవైపు వెళ్లే దారులపైనా బైఠాయించి నిరసనలు చేపట్టారు. దీంతో 130 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా... 200కుపైగా బస్సులు ఆలస్యంగా నడిచాయి.
Published Fri, Nov 8 2013 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement