వెస్టిండీస్తో తొలి టెస్టు మొదటి రోజు భారత్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు విజృంభించి విండీస్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, అనంతరం టీమిండియా ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా తొలిరోజు ఆటను ముగించారు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ను భారత బౌలర్లు 234 పరుగులకు ఆలౌట్ చేశారు. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండు, భువనేశ్వర్, ఓజా, సచిన్ తలా వికెట్ తీశారు. విండీస్ జట్టులో శామ్యూల్స్ (65) టాప్స్కోరర్. ఓపెనర్లు క్రిస్గేల్ (18), పావెల్ (28) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో డారెన్ బ్రావో (23)తో కలసి శామ్యూల్స్ కాసేపు వికెట్లపతనానికి అడ్డుకట్ట వేశాడు. శామ్యూల్స్ను షమీ అవుట్ చేయడంతో విండీస్ పతనం వేగంగా సాగింది. చందర్పాల్ (36) కాసేపు పోరాడిన ఇతర బ్యాట్స్మెన్ పెవిలియన్కు వరుస కట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీసేన మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ కూడా కోల్పోకుండా 37 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్ (16), శిఖర్ ధవన్ (21) క్రీజులో ఉన్నారు. విజయ్ ఆచితూచి ఆడగా, ధవన్ దూకుడుగా ఆడాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులు వెనుకబడివుంది. బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా ఉండటంతో ధోనీసేన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇదిలావుండగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.