ఒక సినిమా తెరకెక్కించడంలో నిర్మాత పాత్ర చాలా కీలకం. రచయిత, దర్శకుల దగ్గర ఎంత మంచి కథ ఉన్నా సరే.. నిర్మాతల చుట్టూ తిరగనిదే పని జరగదు. కానీ, క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి) అనే పద్దతి ద్వారా నిర్మాతల అవసరం లేకుండానే చిత్రాలను తెరకెక్కించవచ్చు. బహుశా ఈ విషయం మనలో చాలా మందికి తెలియక పోవచ్చు.
క్రౌడ్ ఫండింగ్ : ఒక దర్శకుడు లేదా ఒకే వ్యక్తి తన ఆలోచనని ఏ అవధులు లేకుండా స్వతంత్రంగా రూపొందించుకోవాలంటే ఈ క్రౌడ్ ఫండింగ్ పద్దతి ఉపయోగపడుతుంది. మన స్నేహితులు , బంధువులే కాకుండా ప్రజల నుంచి కూడా ఆర్ధిక సహాయం పొంది తమ కల’ళ’లను నెరవేర్చుకోవచ్చు. అయితే క్రౌడ్ ఫండింగ్ అనే పద్దతి భారతదేశానికి దశాబ్దాల క్రితమే పరిచయం.
ఈ పద్ధతిలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్వయంవరం’(మళయాళం-1972). ప్రముఖ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్.. చిత్ర లేఖ ఫిలిం కో-ఆపరేటివ్ సొసైటీ సాయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 1973 లో మూడు జాతీయ అవార్డులను తెచ్చి పెట్టింది. (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు-అదూర్ గోపాలకృష్ణన్, ఉత్తమ నటి-శారద)
ఇక 1976 లో దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తీసిన ‘మంథన్ ‘ చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారానే తెరకెక్కించారు. ఒక పాల కేంద్రం అనుసంధానంతో ఐదు లక్షల మంది రైతుల ద్వారా తలా రెండు రూపాయలు సేకరించి మంథన్ ను రూపొందించారు. మంథన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు తోపాటు విజయ్ టెండూల్కర్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ కి భారత తరపున ఎంట్రీగా కూడా వెళ్లింది.
తెలుగులో కూడా... ఈ పద్దతి ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. సుమారు కోటి రూపాయలతో తెరకెక్కిన “మను” అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. అలాగే “శీష్ మహల్’అనే చిత్రం కూడా క్రౌడ్ ఫండింగ్ పద్దతి ద్వారానే రూపొందించబడింది. శీష్ మహల్ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు , రచయిత, గాయకుడు, ‘ పీయూష్ మిశ్రా ‘ ఉచితంగా పాటలు పాడటం ఓ విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు “వివేక్ సాగర్’ సంగీతాన్ని సమకూర్చారు.
ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించిన CAM RAN ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ INDIE BIRDS (www.indiebirds.com) అనే వెబ్ సైటు ద్వారా ఉచిత క్రౌడ్ ఫండింగ్ సేవలను అందిస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కేవలం సినిమాలు నిర్మించటమే కాకుండా... అనాధల కోసం, వైద్య ఖర్చుల కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం.. ఇలా దేనికోసమైనా ఆర్ధిక సహాయం పొందవచ్చు.