న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన చిరంజీవి వెంకయ్య నాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చూడాల్సిందిగా చిరంజీవి పలువురు ప్రముఖలను కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసి ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా కోరారు. వెంకయ్య నివాసంలో సైరా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ప్రదర్శనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర పెద్దలను చిరంజీవి ఆహ్వానించనున్నారని సమాచారం. వెంకయ్య నాయుడు, ఆయన కుటుంబసభ్యులు, పలువురు కేంద్ర పెద్దలతో కలిసి చిరంజీవి ఢిల్లీలో ‘సైరా’ చిత్రాన్ని వీక్షించనున్నారు.
కాగా, చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవి ఆహ్వానం మేరకు సైరా చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను సైరా చూడటానికి ఆహ్వానించనట్టు చిరంజీవి తెలిపారు.