సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుధవారం జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచరులతో కలసి ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ)ను బెదిరించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్ల గణేశ్ పంపించారని ఈనెల 5న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో పీవీపీ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బండ్ల గణేశ్ పరారీలో ఉన్న గణేశ్‌ను నేడు పట్టుకున్నారు. ఆయనపై గతంలో నమోదైన కేసులను పోలీసులు విచారిస్తున్నారు.