డ్వేన్ జాన్సన్.. డబ్ల్యుడబ్ల్యుఈ రెజ్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈయన్ని అభిమానులు ముద్దుగా రాక్ అని పిలుచుకుంటారు. అతను తర్వాతి కాలంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్‌లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా తన కూతురు తియానాతో సంభాషించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో జాన్సన్ ఏవి చెప్తే వాటిని తిరిగి అప్పజెప్పాలని తియానాకు సూచించాడు. దీనికి ఆ చిన్నారి సరేనంది. తండ్రి మాటలను పొల్లుపోకుండా అప్పజెప్పింది కూడా. కానీ చివర్లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తండ్రి మాటను చెప్పనని మొండికేసింది. దీనికి కారణం లేకపోలేదు. మొదటి నుంచి అతని గారాలపట్టి గురించి పాజిటివ్ అంశాలు చెప్పుకొచ్చాడు. వాటిని ఆమె బుద్ధిగా అప్పజెప్పింది. చివర్లో మాత్రం జాన్సన్ అన్నివైపులా ఓసారి తేరిపార చూసి, తన భార్య అక్కడ లేదని నిర్ధారించుకున్నాక కూతురితో ‘డాడీ ఈజ్ ద బెస్ట్’ అని చెప్పాడు.
దానికి ఆమె ఏమీ తత్తరపాటు లేకుండా ‘డాడీ ఈజ్ ద బెస్ట్’ అని చెప్పింది. కానీ వెంటనే ఆ చిన్నిబుర్ర పాదరసంలా పనిచేసి తన తప్పును సవరించుకుని ‘మదర్’ అని గొంతెత్తి అరిచింది. దానికి మన హాలీవుడ్ స్టార్ అంగీకరిస్తాడా? లేదు.. తండ్రి మాత్రమే బెస్ట్ అని చిన్నారితో చెప్పించేందుకు నానాతంటాలు పడ్డాడు. కానీ తియానా మాత్రం దానికి ససేమీరా అంటోంది. ఈ వీడియో ఆయన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా జాన్సన్ 1997లో డానీ గార్సియాను వివాహమాడగా 2007లో విడిపోయారు. వీరికి పంతొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత జాన్సన్ గతేడాది ఆగస్టులో ప్రియురాలు లారెన్ హషియాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల సహజీవనం తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి సంతానమే ఈ చిన్నారి తియానా.