భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అధికారుల మాటలు లెక్క చేయకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. వివిధ సినిమా పోస్టర్ల ద్వారా అలాగే అనేక ఫన్నీ వీడియోలు రూపొందిస్తూ అర్థమయ్యేలా వివరిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కింగ్ నాగార్జున ఆయన నటించిన శివమణి సినిమాలోని డైలాగులను కరోనా సంబంధిత మాటలుగా మార్చిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నేను ఇప్పడు శివమణి సినిమా చేస్తే కరోనా సంక్షోభంలో పూరి జగన్నాథ్ రాసే డైలాగులు ఇలా ఉంటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో నాగార్జున మాటాలను భవిరి రవి కరోనా నేపథ్యంలో సాగే డైలాగులుగా వినిపించాడు.
2003లో వచ్చిన శివమణి సినిమాలో పోలీస్ పాత్రలో నాగ్ పూర్ణా మార్కెట్ ఇన్స్‌పెక్టర్‌గా వచ్చినప్పుడు స్థానిక రౌడీషీటర్లకు వార్నింగ్ ఇస్తాడు. అయితే ఈ మాటలను తొలగించి కరోనాకు మాస్కులు పెట్టుకోమంటే ఎందుకు వినిపించుకోవడం లేదని రౌడీలను హెచ్చరిస్తున్నట్లు భవిరి రవి ఎడిట్ చేశారు. ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది' అంటూ నాగార్జున రౌడీలకు ఇస్తున్న వార్నింగ్ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కరోనా గురించి నాగార్జున రౌడీలకు ఇచ్చిన వార్నింగ్ వీడియోను మీరు కూడా చూడండి.