వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు.
జగన్ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు. మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు జగన్ సీఎం అయితేనే అమలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని విజయచందర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు.