ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెనకాడని రీల్ విలన్ సోనూ సూద్. రక్షా బంధన్ సందర్భంగా ఈ రియల్ హీరో ఓ వితంతువుకు సాయం చేసి మరోసారి మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. అస్సాంలోని జల్‌పైగురిలో వరదల కారణంగా ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమెకు తోడుగా నిలిచేందుకు భర్త కూడా లేరు. పిల్లలు తినడానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. దీంతో దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మహిళ ట్విటర్‌లో షేర్ చేశారు.
పై లోకంలో ఉండే దేవుడిని తల్చుకునే బదులు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రియల్ హీరోను సాయం చేయమంటూ వేడుకున్నారు. ఈ వీడియో కాస్తా సోనూ దృష్టికి వచ్చింది. నో చెప్పడం ఇంటా వంటా లేని ఆయన వెంటనే ఆమెకు రాఖీ పండుగరోజు వరాన్ని ప్రసాదించారు. చెల్లెమ్మకు కొత్త ఇంటిని కానుకగా ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాఖీ పండుగకు ఇంతకు మించిన గిఫ్ట్ మరొకటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు