ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నీ వామపక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 16న నిర్వహించదలచిన బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.