మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రాయితీలిస్తామని, సకాలంలో అనుమతులిస్తున్నామని చెప్పారు. విశాఖలో భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం కలిసి మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీ రంగంలోనూ, ఉత్పాదకతలోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గిడిజాల వద్ద 50 ఎకరాల్లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ఎతెలిపారు. విశాఖలో ఇప్పటికే రెండు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, మూడవది వచ్చే నెలలో జరుగుతుందని, ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.