నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత అనేది తాత్కాలిక సమస్య అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నదులకు 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని.. 265పైగా ఇసుక రీచ్‌ల్లో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని వెల్లడించారు. వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.