ప్రభుత్వం ఇస్తామన్న కోటి రూపాయలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ నిరాహార దీక్షకు దిగనుందనే సమాచారం అందుకున్న టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సాఫ్ చైర్మన్ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ సాయంత్రంలోపు జ్యోతి సురేఖకు జీవో ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతవరకూ దీక్ష ఆలోచనను విరమించుకోవాలని కోరారు. అయితే డొక్క ప్రతిపాదనను సురేఖ సున్నితంగా తిరస్కరించారు. క్రీడాకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించని చెరుకూరి సత్యనారాయణకు తనకు కేటాయించిన నజరానాలో 15లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేశారు.