‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ‘నేను సావర్కర్’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. అసెంబ్లీ బయటకూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. హిందుత్వ సిద్ధాంత కర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫడ్నవీస్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమం గురించి తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు.