వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బద్ధ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికతో మనస్తాపానికి లోనైనా ఇరు పార్టీల నేతలు కొందరు ఇప్పటికే వారి పార్టీలను వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన రామచంద్రయ్య.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రయ్యకు కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు అదే జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్ సుబ్బరాఘవరాజు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. రామచంద్రయ్య చేరికతో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.