జనవరి 17, 2016.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చరిత్రలో ఓ బ్లాక్‌డే. విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రతను పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల మరణం ఎలుగెత్తి చాటిన రోజది. రోహిత్ ఆత్మహత్యకు దాదాపు రెండేళ్లు నిండ బోతున్నాయి. ఇప్పుడు మరోమారు వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో వెలివాడ వెలిసింది. అణచివేతను ధిక్కరిస్తూ అగ్గిరాజుకుంది. 75 శాతం హాజరు లేదన్న కారణంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్ నరేశ్ గెలుపుని ప్రకటించకపోవడం యూనివర్సిటీలో ఆందోళనలకు దారితీ సింది. హాజరుపట్టీలో ప్రజెంట్‌ని ఆబ్సెంట్‌గా తారుమారు చేసి నరేశ్ గెలుపుని ఓడించాలన్న ఆత్రుతలో వర్సిటీ తప్పులపై తప్పులు చేస్తూ పోయింది. వీసీ అప్పారావు ఏబీవీపీతో కుమ్మౖక్కై వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన నరేశ్‌ని అడ్డుకోవడానికి గ్రీవెన్స్ సెల్‌ని పావుగా వాడుకున్నారని ఆరోపిస్తూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది.