ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు రవాణా సంస్థల ఉల్లంఘనలపై తాము కోరిన వివరాలను సమర్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రైవేటు రవాణా సంస్థలను కాపాడేందుకే కాలయాపన చేస్తున్నట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రవాణా సంస్థల తీరు వల్ల ప్రజలు మరణిస్తున్నా మీకు పట్టదా? అంటూ నిలదీసింది. మోటారు రవాణా కార్మికుల చట్టం ప్రకారం నమోదు చేసుకోకుండా, డ్రైవర్ల పని గంటల విషయంలో నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్న రవాణా సంస్థలను, వాటిపై తీసుకున్న చర్యలు తదితర వివరాలను తమ ముందుంచాల్సిందేనని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖల కమిషనర్లకు స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటికి ఈ వివరాలను ముందుంచని పక్షంలో స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.