బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మండ్యా జిల్లాలోని కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో కనీసం 8 స్థానాలు గెల్చుకోవాలి. డిసెంబర్ 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మండ్యా లోక్‌సభస్థానం నుంచి పోటీచేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు కుమారస్వామి ప్రజలతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే.