రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాల్లో భారీగా దోపిడీ జరిగినట్లు సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తేల్చిచెప్పింది. కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనం కలిగించారని, తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ‘కాగ్’ ఆడిట్‌లో స్పష్టం చేసింది. సర్వే, ఇన్వెస్టిగేషన్ లేకుండానే సాంకేతిక అనుమ తులు ఇచ్చారని తప్పుపట్టింది. తాత్కాలిక సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తోందన్న ఆరోపణలు మొదటినుంచే వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం కలిగించడంతోపాటు టెండర్ నిబంధనలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని, ఇంజనీరింగ్– ప్రొక్యూర్‌మెంట్– కనస్ట్రక్షన్(ఈపీసీ) విధానానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ‘కాగ్’ స్పష్టం చేయడం గమనార్హం.