ఏపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అవహేళన చేస్తూ టీడీపీలో చేరిన 22మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజగన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.