పెళ్లయిన ఏడు నెలలకే భర్త, అతడి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, న్యాయం చేయాలంటూ స్కేటింగ్ జాతీయ క్రీడాకారిణి రుచిక జైన్ వేడుకున్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగవద్దంటూ శుక్రవారం మారేడుపల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన రుచిక జైన్(21) స్కేటింగ్ జాతీయ క్రీడాకారిణి. పలు పోటీల్లో వందకు పైగా గోల్డ్‌మెడల్స్ సాధించారు. గతేడాది డిసెంబర్ 11న బోయిన్‌పల్లికి చెందిన అక్షయ కఠారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్దిరోజులకు అక్షయ నిజస్వరూపం బయటపడిందని ఆమె తెలిపారు. అతను మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అతడి సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లపై నిలదీయగా అతడితో పాటు కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. దీంతో ఈ నెల 20న బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తతో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సమావేశంలో బాధితురాలి అన్న అలోక్, తల్లి సరిత ఉన్నారు.