ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి 2015 మేలో వివాహం చేశారు. శ్రీదేవి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడంతో తల్లి కనకదుర్గే పెంచింది. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు.