తన ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లల్ని తానే తింటుందని చెబుతుంటారు. అదే తీరున గుంటూరు జిల్లా గురజాల అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధనదాహానికి సొంత పార్టీ నేతల్నే బలి తీసుకుంటున్నారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి కన్ను సొంత పార్టీ నేతల క్వారీలపై పడింది. వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ అలియాస్ బుజ్జి.. యరపతినేని బెదిరింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.