ఐటీ దాడులపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ... గతంలో తమ ఉమ్మడి ఆస్తి అయిన గోదాముల విక్రయానికి సంబంధించి తక్కువగా చూపించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌పై అధికారులు వివరణ అడిగారే తప్ప, ఎలాంటి దాడులు జరపలేదన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వల్ల గత కొంతకాలంగా ఐటీ రిటన్స్ పట్టించుకోలేదన్నారు. వాటిని కూడా చెల్లిస్తామని ఐటీ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు నవీన్ పేర్కొన్నారు. కాగా జ్యోతుల నెహ్రు ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.