సాక్షి, కాకినాడ : వాగులో కొట్టుకుపోతున్న పశువుల కాపరిని ఫైర్ సిబ్బంది కాపాడిన ఘటన ప్రత్తిపాడు మండలం లంపకలోప వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాచపల్లికి చెందిన కొల్లు వీరబాబు పశువుల మేత కోసం సుద్దగడ్డ వాగు దగ్గరకు వచ్చాడు. ఈ నేపథ్యంలో పశువుల మేత తీస్తుండగా ఒక్కసారిగా కాలు జారి వాగులో పడిపోయాడు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరబాబు చెట్ల కొమ్మలను పట్టుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పశువుల కాపరిని బయటకు తీశారు.