పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబును ఆయన కోరారు. నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనపై వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. ’’పోలవరంపై రాజకీయం వద్దు. టెండర్ల విషయంలో అనవసర గందరగోళం సృష్టించొద్దు. ప్రాజెక్టు విషయంలో కమిట్ మెంట్‌తో పని చేస్తున్నది బీజేపీ మాత్రమేనని ఆయన చెప్పారు. గతంలో రాజ్యసభలో ముంపు మండలాలపై అప్పటి బీజేపీ సీనియర్ నేగా ఉన్న వెంకయ్యనాయుడు ఒక్కరే మాట్లాడారని.. అప్పుడు టీడీపీ తరపున ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సమన్యాయం అంటూ కిక్కురుమనకుండా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజు గుర్తు చేశారు. కేంద్రపై నెపం నెట్టేయటం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. సమస్యలను అధ్యయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. చాతగాక కేంద్రానికి వెనక్కి ఇచ్చేస్తాం అన్న సీఎం తీరు సరికాదని సోమువీర్రాజు తెలిపారు.