పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయక ముందే నీరవ్ మోదీ భారత్‌ను విడిచి విదేశాలకు పారిపోయినట్టు తెలిసింది. పీఎన్‌బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్ రంగం తీవ్ర షాకింగ్‌కు గురైంది.