న్యూఢిల్లీ: తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్‌ను తొలగించిన కారణంగా తనకు మరింత గడువు ఇవ్వాలని నిర్భయ దోషి పవన్ గుప్తా కోర్టును అభ్యర్థించాడు. కొత్త లాయర్‌ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన (ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది.
ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. తన తరఫున వాదించేందుకు ఎవరూ లేని కారణంగా మరింత సమయం ఇవ్వాలని కోరాడు. ఇందుకు స్పందించిన కోర్టు.. తామే లాయర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలును జాప్యం చేసేందుకే దోషులు నాటకాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
‘‘దోషుల ఉరిశిక్ష అమలుకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా అడుగుతూనే ఉన్నాను. ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి వారికి డెత్ వారెంట్లు జారీ చేయలేదు. వారం రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు లాయర్ లేకుండా కోర్టుకు హాజరయ్యారు. బాధితురాలి తల్లినైన నేను ఇక్కడ ఉన్నాను. చేతులు కట్టుకుని న్యాయం కోసం అర్థిస్తున్నాను. మరి నా హక్కులు ఏమై పోయినట్లు’’ అని న్యాయమూర్తి ముందు తన బాధను వెళ్లగక్కారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘ఇక్కడ ప్రతీ ఒక్కరు మీ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి’’ అని సమాధానమిచ్చారు.