ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కూమర్తె (19) ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నాననీ ఆ యువతి చెప్తున్న వీడియో బయటికి రావడం సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇండియాలో ఆగ్రహం వ్యక్తం అవుతండడంతో పాకిస్తాన్ విచారణకు ఆదేశించింది. వివరాలు..లాహోర్‌లోని నంకనా సాహెబ్‌లోని సిక్కు పూజారి కుమార్తె జగ్జీత్ కౌర్ గత మూడు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నారు. ఈ మేరకు యువతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్‌లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ శనివారం స్పందించి విచారణకు ఆదేశించారు.