ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్‌కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు. డ్వాక్రా రుణమాఫీ కంటే పసుపు కుంకుమకే ఎక్కువ ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 2014 మార్చి 31కి ముందు రిజిస్టర్ అయిన గ్రూపులకు మాత్రమే ఇచ్చామని, కొత్త గ్రూపులకు ఇవ్వలేదని స్పష్టంచేశారు.
రుణ మాఫీ కాలేదు
Published Sat, Sep 8 2018 9:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement