మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు.