భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న నిరాహార దీక్షను అడ్డుకనేందుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభలను సజావుగా సాగనీయకుండా అడ్డుపడిన ప్రతిపక్షాల తీరుకు నిరసనగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఎంపీలు దేశవ్యాప్తంగా ఒక రోజు(గురువారం) నిరహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంటును అడ్డుకున్నాయని నరసింహారావు అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా తిరస్కరించారని చెప్పారు. పార్లమెంటు నిర్వహణలో అడ్డుపడటమే కాక, బీజేపీ శాంతియుతంగా నిరాహార దీక్షకు కూడా టీడీపీ అడ్డుపడుతోందని అన్నారు.