ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని, ఇకకైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం కోర్టులను తప్పు దోవ పట్టించిందని ఆరోపించారు. విలీనం చేస్తేనే చర్చలకు వస్తామంటున్నామని, విలీన డిమాండ్‌పై పట్టు వీడడం లేదంటూ తమపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకుంటున్నామని, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సం ఘాలతో చర్చలు జరపాలని కోరారు.