ప్రకృతినే హ్యాండిల్ చేసే మాటెలా ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దలేకపోతున్నారు. తమకు ఆహారం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తుపాన్, వరద బాధితులు మండిపడుతున్నారు. రెండు రోజుల్లోనే కరెంట్ సరఫరా పునరుద్ధరిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆరు రోజులు గడిచినా కరెంటు జాడే కనిపించడం లేదు. గొంతెండిపోతోంది, గుక్కెడు నీరు ఇప్పించండంటూ వేలాది మంది గగ్గోలు పెడుతున్నారు. ఒక అన్నం పొట్లం, రాత్రిపూట కొవ్వొత్తి అయినా ఇవ్వండని దీనంగా వేడుకుంటున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు ఇప్పటికీ ఊపందుకోలేదు.